#National News

Delhi – 13 నుంచి సరి-బేసి విధానం

ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయిన కాలుష్య నియంత్రణకు దిల్లీలో ఈ నెల 13 నుంచి  వాహనాలకు సరి-బేసి అంకెల విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది ఈ నెల 20 వరకూ కొనసాగనుంది. వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు చివరన సరి అంకె ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి అంకె ఉన్న వాహనాలు మరో రోజున రోడ్లపైకి అనుమతిస్తారు. ఈ మేరకు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్‌ సోమవారం విలేకరులకు వెల్లడించారు. ప్రభుత్వం పేర్కొన్న రక్షణ స్థాయులకు ఏడెనిమిది రెట్ల కాలుష్యం సోమవారం ఉదయానికి నమోదు కావడం విశేషం. సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) రోజు రోజుకూ క్షీణిస్తూ 454కు చేరుకుంది. అలాగే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పాఠశాలల భౌతిక తరగతుల నిర్వహణను రద్దు చేస్తున్నట్లు మంత్రి గోపాల్‌రాయ్‌ ప్రకటించారు. బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నందున 10, 12వ తరగతులను మాత్రం ఈ రద్దు నుంచి మినహాయించారు. ఇక నిర్మాణ కార్యక్రమాలపై పూర్తిగా ఆంక్షలు విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రహదారులు, వంతెనల వంటి ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణ పనులను కూడా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. బీఎస్‌3 పెట్రోల్‌, బీఎస్‌4 డీజిల్‌ వాహనాలపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించారు. కేవలం అత్యవసర వస్తువులను సరఫరా చేసే ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ ట్రక్కులను మాత్రమే దిల్లీలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సిబ్బందితో, మిగతా సిబ్బంది ఇంటి నుంచి పనిచేసే విధానంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. మరోపక్క దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై జిల్లాస్థాయిలో నిపుణుల కమిటీ వేయాలని చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఇది విధానపరమైన అంశమేనని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *