Chhattisgarh Deputy Chief Minister TS Singh Deo praised Prime Minister Modi – ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్(TS Singh Deo) ప్రధాని మోదీ (PM Modi)పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ప్రధాని రాష్ట్రంలో పర్యటించి భారీ ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగ్ దేవ్ రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.
రాష్ట్రానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ఉప ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. ‘‘కేంద్ర మార్గదర్శకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పనిచేశాం. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల ఎన్నడూ వివక్ష చూపలేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఎంతో సహకరించింది. ప్రధాని రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో భారీ ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు చేశారు. అందుకు నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో మరెన్నో ప్రాజెక్టులను రాష్ట్రానికి అందిస్తారని ఆశిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పని చేస్తే కచ్చితంగా అభివృద్ధి సాధ్యం అవుతుంది’’ అని సింగ్ దేవ్ అన్నారు.
ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌లో రూ. 6,400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. తొమ్మిది జిల్లాల్లో ‘‘క్రిటికల్ కేర్ బ్లాక్స్’’ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు లక్ష సెల్ కౌన్సెలింగ్ కార్డులను పంపిణీ చేశారు. రానున్న కాలంలో మరికొన్ని ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తామని ప్రధాని ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఇది దేశ అభివృద్ధికి శక్తివంతమైన కేంద్రంగా మారిందని మోదీ అన్నారు.