Canada has temporarily halted the issuance of visas to Indian citizens – కెనడా భారత పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది

భారత్ వ్యతిరేక శక్తులు, ఖలిస్థాన్ ఉగ్రవాదుల కార్యకలాపాలకు నిలయంగా మారిన కెనడా పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సందేశాన్ని విస్పష్టం చేసేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. మన దేశంలో కెనడా దౌత్య కార్యాలయ సిబ్బందిని తగ్గించుకోవాలని సూచించింది. ఖలిస్థాన్ అనుకూల శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పునరుద్ఘాటిస్తూ ఈ విషయాలను ప్రకటించింది. కెనడాలో అధికమవుతున్న భారత్ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలపై తమ ఆందోళనలను దిల్లీ వర్గాలు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర మిత్ర దేశాలతో పంచుకున్నట్లు తెలిసింది. మరోవైపు భారత్‌పై తాను చేసిన ఆరోపణలను కెనడా ప్రధాని ట్రూడో సమర్థించుకున్నారు. తాజా పరిణామాలతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కెనడాతో దౌత్య వివాదం మరింత తీవ్రమైన నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కెనడాలోని మన హైకమిషన్, దౌత్యకార్యాలయాలకు బెదిరింపులు వస్తుండడంతో భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని, దీంతో అక్కడ సిబ్బంది పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కెనడా పౌరులకు అన్ని రకాల వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇతర దేశాల్లో ఉంటూ వీసా కోసం దరఖాస్తు చేసుకునే కెనడియన్లకూ ఇది వర్తిస్తుందన్నారు. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటామని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే వీసాలు పొందిన వారు, ఓసీఐ (ఓవర్‌సీస్ సిటిజెన్‌షిఫ్ ఆఫ్ ఇండియా) పత్రాలు కలిగిన వారు భారత్‌కు రావటానికి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. సమస్య వీసాల జారీకి సంబంధించి మాత్రమేనని చెప్పారు.
‘‘కెనడాలో ఉన్న మన దౌత్యవేత్తల కంటే.. భారత్‌లో ఆ దేశ దౌత్యాధికారుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య సమానత్వం ఉండాలి. అంతేగాక, భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యాధికారులు జోక్యం చేసుకుంటున్నారు. కెనడా తన దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని స్పష్టం చేశాం. మన దేశంలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం. కెనడా కూడా మన దౌత్యవేత్తల భద్రత పట్ల అంతే నిబద్ధతతో ఉండాలని కోరుతున్నాం’’ అని బాగ్చి వెల్లడించారు. ఇరు దేశాల మధ్య తాజా వివాదానికి కారణమైన ఖలిస్థానీ మద్దతుదారు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అవి రాజకీయ ప్రేరేపితమైనవేనని పేర్కొన్నారు. ‘నిజ్జర్ ఘటన గురించి ఆ దేశం ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ, కెనడా గడ్డపై జరుగుతున్న భారత్ వ్యతిరేక శక్తులకు సంబంధించి అన్ని ఆధారాలను ఆ దేశానికి ఇచ్చాం. కొన్నేళ్లుగా 20-25 మంది వ్యక్తులను మన దేశానికి అప్పగించాలని కోరాం. అటు వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. మన డిమాండ్లపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు’’ అని బాగ్చి దుయ్యబట్టారు.