Canada has issued several instructions to its citizens living in India – భారత్‌లో నివసిస్తున్న తమ పౌరులకు పలు సూచనలు జారీ చేసిన కెనడా

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశంలో భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటువేయగా, బదులుగా భారత్ ఆ దేశ రాయబారిని బహిష్కరించింది. తాజాగా భారత్‌లో పర్యటిస్తున్న తమ పౌరులకు కెనడా పలు హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
‘‘భారత్‌లో ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ, భద్రతా సమస్యలు ఎప్పుడైనా ఉత్పన్నం కావచ్చు. పరిస్థితులు వెనువెంటనే మారవచ్చు. నిరంతరం అప్రమత్తంగా ఉండండి. స్థానిక అధికారుల సూచనలను మీడియాలో ఎప్పటికప్పుడు అనుసరించండి. అత్యవసరం అయితే తప్ప భారత్ ప్రయాణం చేపట్టవద్దు. మీ భద్రతను ప్రమాదంలో పెట్టవద్దు. కుటుంబ, వ్యాపార సంబంధ, లేదా పర్యాటక నేపథ్యంలో ఇండియా వెళదామన్న నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు ఇండియాలోనే ఉంటే కచ్చితంగా అక్కడే ఉండాల్సిన అవసరాన్ని ఆలోచించండి. ఒకవేళ అక్కడ కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేకుంటే వెంటనే ఆ దేశాన్ని వదిలి రావాలి’’ అని పేర్కొంది. ఈ మేరకు కెనడా తన ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఈ వివరాలు వెల్లడించింది.
అనూహ్యమైన భద్రత పరిస్థితుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు ప్రయాణం మానుకోవాలని తమ పౌరులకు కెనడా సూచించింది. ఉగ్రముప్పు, మిలిటెన్సీ, అశాంతి, కిడ్నాప్ ముప్పు నేపథ్యంలో పర్యటించవద్దని అడ్వైజరీలో పేర్కొంది.