Ayodhya : రామాలయం జనవరిలోగా ప్రారంభం కాబోతోంది..

ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు మరియు జనవరిలో తెరవనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో తొలి సోలార్ సిటీగా కూడా అయోధ్య అవతరిస్తుంది. యుపి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 22న జరిగే అవకాశమున్న రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్ర ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్య నగరాన్ని సౌర కాంతులతో నింపే పనులను ఇటీవల పర్యవేక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘‘సూర్యవంశానికి రాజధాని అయోధ్య. కాబట్టి, ఇక్కడ ఇతర మార్గాల ద్వారా కాకుండా ఆ సూర్యుడి ద్వారానే విద్యుత్తు ప్రసరిస్తుంది’’ అని ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా సరయూ నది ఒడ్డున 40 మెగావాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. వీధిదీపాలు మొదలు సౌరశక్తితో నడిచే పడవలు, ప్రజా రవాణా, మొబైల్ చార్జింగ్ కేంద్రాలు, ప్రభుత్వ భవనాల విద్యుదీకరణ.. ఇలా సర్వం సోలార్ పవర్ ఆధారంగానే నడవనున్నాయి.