Attempt to open emergency door before landing.. – ల్యాండింగ్‌కు ముందే ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం..

విమానంలో కొందరు ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించడం, సిబ్బందిపై దాడి చేయడం వంటి ఘటనలు ఇటీవల తరచూ చూస్తున్నాం. తాజాగా ఇండిగో విమానం ( IndiGo flight)లో ఓ ప్రయాణికుడు తోటివారిని హడలెత్తించాడు. విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు యత్నించాడు. ఈ ఘటన దిల్లీ (Delhi) నుంచి చెన్నై (Chennai)కు బయలుదేరిన విమానంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..
ఇండిగో విమానం 6E 6341 మంగళవారం రాత్రి దిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరింది. మరికొద్దిసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. విమానం చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే సదురు వ్యక్తిని సీఐఎస్‌ఎఫ్ (CISF) అధికారులకు అప్పగించారు.
విమానంలో జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలను ఎయిర్‌లైన్స్ అధికారులు సీఐఎస్‌ఎఫ్‌కు వివరించారు. అంతేకాకుండా నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఇండిగో ఎయిర్‌లైన్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.