Another historical building in India has entered the list of world heritage buildings – ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారత్‌లోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది

కర్ణాటకలోని ‘హోయసల’ (Hoysala) ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్లు యునెస్కో (UNESCO) వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన బేలూర్, హళేబీడ్, సోమనాథ్‌పుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతోన్న 45వ ‘వరల్డ్ హెరిటేజ్ కమిటీ’లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్‌లోని ‘శాంతినికేతన్’కు ఈ గుర్తింపు లభించిన మరుసటి రోజే హోయసల ఆలయాలు ఈ జాబితాలో చేరడం విశేషం.
హోయసలకు ఈ గౌరవం దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ‘యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో హోయసలకు చోటు లభించడం భారత్‌కు ఎంతో గర్వకారణం. ఆలయాలపై చెక్కిన సమాచారం, అద్భుతమైన శిల్పకళ భారత సాంస్కృతిక వారసత్వం, పూర్వీకుల కళానైపుణ్యానికి నిదర్శనం’ అని ట్వీట్ చేశారు. హోయసల పవిత్ర ఆలయాలు 2014 ఏప్రిల్ 15 నుంచే యునెస్కో పరిశీలన జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం వాటి పరిరక్షణ బాధ్యతలను ఆర్కియాలాజిక్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వర్తిస్తోంది.