Another encounter took place in Uttar Pradesh – ఉత్తరప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో మరో ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. రైల్లో ఓ మహిళా కానిస్టేబుల్ (Women Constable)ను వేధించిన కేసులో ప్రధాన నిందితుడు శుక్రవారం పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న అతడిని పోలీసులు నేడు అరెస్టు చేసేందకు ప్రయత్నించగా.. ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కాల్పుల్లో మరో ఇద్దరు నిందితులు గాయపడినట్లు యూపీ పోలీసులు (UP Police) వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
ఆగస్టు 30న సరయూ ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. సీటు విషయంలో ఆమెతో ఓ వ్యక్తి గొడవపడ్డాడు. అది కాస్త ఘర్షణగా మారి.. నిందితుడు తన స్నేహితులతో కలిసి ఆమెను తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం అయోధ్య స్టేషన్ రాగానే వారంతా రైలు దిగి పారిపోయారు. రైలు కంపార్ట్‌మెంట్‌లో రక్తపు మడుగులో స్పృహకోల్పోయి ఉన్న ఆ మహిళా కానిస్టేబుల్‌ను రైల్వే పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వాట్సప్‌లో వైరల్ అయిన వార్తలను సుమోటోగా స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు.. యూపీ ప్రభుత్వం, రైల్వే పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను గుర్తించి, అరెస్టు చేయాలని యూపీ పోలీసులను ఆదేశించింది.
ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక సమాచారం ఆధారంగా ప్రధాన నిందితుడిని అనీశ్ ఖాన్‌గా గుర్తించారు. అతడిని అరెస్టు చేసేందుకు అయోధ్యలో సోదాలు చేపట్టారు. పోలీసులను చూసిన అనీశ్, అతడి అనుచరులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎన్‌కౌంటర్ జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో గాయపడిన అనీశ్.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు నిందితులు కూడా గాయపడినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఓ పోలీసుకు తూటా గాయాలయ్యాయని పేర్కొన్నారు.