America – మన అంతరిక్ష పరిజ్ఞానాన్ని అడిగింది

చంద్రయాన్-3 వ్యోమనౌక అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. కాలం మారిందని.. భారత్ సైతం అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగలదన్నారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు ద్వారాలు తెరిచారని చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్ ప్రసంగించారు. ‘‘మనది చాలా శక్తిమంతమైన దేశం. మన విజ్ఞానం, మేధస్సు ప్రపంచంలో అత్యుత్తమం. చంద్రుడిపై ల్యాండింగ్‌కు ఉద్దేశించిన చంద్రయాన్-3’ వ్యోమనౌకను రూపొందించిన అనంతరం నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) నిపుణులను ఆహ్వానించాం. వారికి చంద్రయాన్-3 గురించి వివరించాం. దీని రూపకల్పనకు ఇంజినీర్లు ఏ విధంగా కష్టపడ్డారు? చంద్రుడిపై ఏ విధంగా ల్యాండ్ చేయనున్నాం? తదితర విషయాలు చెప్పాం. అంతా సాఫీగా జరుగుతుందంటూ వారు సమాధానమిచ్చారు. మన శాస్త్రీయ పరికరాలను పరిశీలించి.. అవి చాలా తక్కువ ఖర్చుతో, నిర్మాణానికి సులభంగా, అత్యాధునిక సాంకేతికతతో ఉన్నాయన్నారు. వాటిని ఎలా రూపొందించారు? ఈ సాంకేతికతను అమెరికాతో ఎందుకు పంచుకోకూడదు? అని అడిగారు’ అని సోమనాథ్ గుర్తు చేసుకున్నారు.