Akshardham Temple – అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో ప్రారంభించబడింది…

ఆధునిక యుగంలో భారత్ వెలుపల నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయం అమెరికాలో లాంఛనంగా ప్రారంభమైంది. న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో నిర్మించిన అక్షర్‌ధామ్ ఆలయాన్ని ఆదివారం మహంత్ స్వామి మహరాజ్ సమక్షంలో భారీ వేడుక నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయం ప్రారంభం సందర్భంగా సెప్టెంబరు 30 నుంచి 9 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారు. న్యూయార్క్ నగర మేయర్ కార్యాలయ ఉప కమిషనర్ (అంతర్జాతీయ వ్యవహారాలు) దిలీప్ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ ఆలయ నిర్మాణంతో అమెరికాలోని అక్షర్‌ధామ్ ఆలయ వాలంటీర్లు, భక్తుల కల నెరవేరినట్లైందని చెప్పారు. రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో 2011లో దీని నిర్మాణం ప్రారంభమైంది. 183 ఎకరాల్లో అక్షర్‌ధామ్ పేరుతో నిర్మితమైన ఈ ఆలయాన్ని ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న హిందువులు, ఇతర మతస్థులు దర్శించుకుంటున్నారు. ఆలయంలో మొత్తం 10 వేల విగ్రహాలు, శిల్పాలు ఉంటాయని అంచనా. ఒక ప్రధాన గర్భగుడి, 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు భారీ గుమ్మటాన్ని అక్షర్‌ధామ్‌లో చూడొచ్చు. బ్రహ్మకుండ్ అనే పేరుతో ఏర్పాటు చేసిన సంప్రదాయ బావిలో ప్రపంచవ్యాప్తంగా 300 నదుల నుంచి సేకరించిన జలాలను కలిపారు.