#National News

Air Pollution – కాలుష్యంపై పోరు.. ‘కృత్రిమ వర్షానికి’ సిద్ధమవుతోన్న దిల్లీ!

రోజురోజుకు పెరిగిపోతోన్న కాలుష్యంతో (Air Pollution) దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రమాదకర స్థితిలో పెరిగిపోవడంతో నియంత్రణకు ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో క్లౌడ్‌ సీడింగ్‌ (Cloud seeding) విధానంలో కృత్రిమ వర్షాన్ని (Artificial Rain) కురిపించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఐఐటీ కాన్పూర్‌ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్‌ 20-21 తేదీల్లో దీనికి అనుకూలమైన వాతావరణం ఉండవచ్చని అంచనా వేసింది.

క్లౌడ్‌ సీడింగ్‌ పద్ధతిలో కృత్రిమ వర్షాన్ని కురిపించి కాలుష్యానికి చెక్‌ పెట్టవచ్చని ఐఐటీ కాన్పూర్‌ నిపుణులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐఐటీ కాన్పూర్‌ నిపుణులతో దిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ సమావేశమయ్యారు. వాతావరణంలో మేఘాలు లేదా తేమ ఉన్నప్పుడు మాత్రమే క్లౌడ్‌ సీడింగ్‌ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా దిల్లీ మంత్రికి నిపుణులు వివరించారు. ఇందుకు అనుకూల వాతావరణం నవంబర్‌ 20-21 తేదీల్లో ఏర్పడవచ్చని అంచనా వేశారు.

ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తూ నవంబర్‌ 9లోగా ఓ నివేదిక రూపొందించాలని నిపుణులను కోరామని.. దీన్ని సుప్రీంకోర్టుకు అందజేస్తామని దిల్లీ మంత్రి గోపాల్‌రాయ్‌ పేర్కొన్నారు. ఈ సాంకేతికత వినియోగానికి సంబంధించి అవసరమైన అనుమతులను పొందాల్సి ఉంటుందన్నారు. క్లౌడ్‌ సీడింగ్‌పై పరిశోధనలు చేసిన ఐఐటీ కాన్పూర్‌ నిపుణులు.. దిల్లీ ప్రభుత్వానికి ఇటీవలే ఓ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ఇదిలాఉంటే, క్లౌడ్‌ సీడింగ్‌పై ప్రపంచదేశాలతోపాటు మన దేశంలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయని భారత వాతావరణశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. దేశంలో వీటిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని అయినప్పటికీ గణనీయ పురోగతి సాధించలేదన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *