Air India – కరాచీలో అత్యవసరంగా దిగిన విమానం

దుబాయ్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఒకటి వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో దిగింది. విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురవడమే ఇందుకు కారణమని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలిపారు. శనివారమే ఈ ఘటన చోటుచేసుకోగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ‘‘దుబాయ్- అమృత్‌సర్ విమానంలోని ఓ ప్రయాణికుడికి మార్గమధ్యలో అకస్మాత్తుగా వైద్యపరమైన సమస్యలు తలెత్తాయి. దీంతో వీలైనంత త్వరగా అతడికి వైద్య సాయం అందించేందుకుగానూ కరాచీ నగరం అత్యంత సమీపంలో ఉండడంతో విమానాన్ని అక్కడకు మళ్లించారు. విమానం కిందకు దిగిన వెంటనే సంబంధిత వ్యక్తికి విమానాశ్రయంలోని వైద్య సిబ్బంది చికిత్స చేశారు. చికిత్స పొందిన వ్యక్తి ప్రయాణించేందుకు సైతం వైద్యుడు అనుమతి ఇచ్చారు. అనంతరం విమానం కరాచీ నుంచి అమృత్‌సర్‌కు చేరుకుంది’’ అని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలిపారు.