A Rare case :- సుప్రీంకోర్టు వాదన సమయంలో సంకేత భాష …

దివ్యాంగురాలైన న్యాయవాది ఓ కేసులో వాదనలు వినిపించడానికి సంజ్ఞల భాష నిపుణుడిని అనుమతించిన అరుదైన ఘట్టం సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. ఈ నెల 22న వర్చువల్ విధానంలో కేసు విచారణËను ఓ వ్యక్తి సంజ్ఞలతో వివరించడం న్యాయవాదులను ఆశ్చర్యానికి గురిచేసింది. కేరళకు చెందిన సారా సన్నీకి పుట్టుకతో వినికిడి లోపం ఉంది. అయినప్పటికీ పట్టుదలతో న్యాయవిద్యను పూర్తిచేసి, ప్రముఖ న్యాయవాది సంచితా ఐన్ వద్ద జూనియర్‌గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఓ కేసు విచారణలో భాగంగా ఆమెతో కలిసి కోర్టుకు సారా హాజరయ్యారు. వాదోపవాదనలు ఆమెకు అర్థమయ్యేందుకు ‘భారతీయ సంజ్ఞల భాష’ వ్యాఖ్యాత సౌరవ్ రాయ్ చౌధురిని సంచిత ఏర్పాటు చేశారు. విచారణను సౌరవ్ వివరిస్తుండగా దానిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వ్యాఖ్యాతను అనుమతించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ను సంచిత అభ్యర్థించారు. దానికి ఆయన ఆమోదం తెలపడంతో ఈ కేసుతో సహా ఇతర కేసుల విచారణను సంజ్ఞల ద్వారా రాయ్ వివరించారు. ఆయన చాలావేగంగా వివరిస్తున్నాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా అభినందించారు. దివ్యాంగ న్యాయవాదులు ప్రత్యేక వెసులుబాటు పొందేందుకు అనుమతించిన సీజేఐకి సారా సన్నీ, ఇతర న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ వ్యాఖ్యాత సాయంతో వాదనలు వినిపిస్తానని సారా ధీమా వ్యక్తంచేశారు.