Visas issued – 90 వేల వీసాలు జారీ.

అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునేవారి సంఖ్య ఏటా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యం సైతం డిమాండుకు తగినట్లుగా వీసాలను జారీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ వేసవిలో (జూన్, జులై, ఆగస్టు) రికార్డు స్థాయిలో 90వేలకు పైగా వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) వెల్లడించింది. అమెరికాలో చదువుకోసం ప్రపంచవ్యాప్తంగా జారీ చేస్తున్న ప్రతి నాలుగు విద్యార్థి వీసాల్లో ఒకటి భారత్‌లోనే ఉంటుందని తెలిపింది.
‘ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి అమెరికాను లక్ష్యంగా పెట్టుకొన్న భారతీయ విద్యార్థులకు శుభాకాంక్షలు. మా టీమ్‌వర్క్, సాంకేతికత సహాయంతో.. అర్హత పొందిన దరఖాస్తుదారులు సరైన సమయంలో ప్రవేశాలు పొందారని ఆశిస్తున్నాం’ అని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది.
అమెరికాలో ఉన్నత విద్యకోసం ఏటా వెళ్లేవారిలో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు. గతేడాది మొత్తంగా 1.25 లక్షల మందికి అమెరికా విద్యార్థి వీసాలు (Student visa) జారీ చేయగా.. వేసవిలో 82 వేల మందికి వీసాలను అందించింది. మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వలేదని.. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఇటీవలే తెలిపింది. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో ఒకే సీజన్‌లో 90 వేల వీసాలను జారీ చేసినట్లు ప్రకటించింది. అమెరికాలోని విద్యాసంస్థలు ఏటా రెండుసార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు- డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు.