24 people died in 24 hours – 24 గంటల్లో 24 మంది మృతి

మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 24 గంటల్లో 24 మంది మరణించారు. వారిలో 12 మంది శిశువులు ఉన్నారు. మిగిలినవారు పెద్దవారు. ‘నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాలలో 24 మంది చనిపోయారు. చనిపోయిన 12 మంది శిశువుల్లో కొందరు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చిన వారున్నారు. మిగిలిన వారు పలు కారణాలతో మరణించారు’ అని మహారాష్ట్ర వైద్య విద్య, పరిశోధన డైరెక్టరు దిలీప్ మైశేఖర్ సోమవారం వెల్లడించారు. ఈ విషాదంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి మంగళవారం మధ్యాహ్నానికల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు రోగుల్లో కొందరు పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి డీన్ శంకర్‌రావు చవాన్ తెలిపారు. పలువురు సిబ్బందిని బదిలీ చేయడంతో రోగులకు సేవలందించడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
ఈ అంశంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మూడు ఇంజిన్ల (భాజపా, ఏక్‌నాథ్ శిందే, అజిత్ పవార్) ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలని డిమాండు చేస్తున్నాయి.ఈ ఘటనను ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తీవ్రంగా ఖండించారు. మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.