War – హమాస్, ఇజ్రాయెల్ ఘర్షణతో ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా

హమాస్, ఇజ్రాయెల్ ఘర్షణతో ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో ముప్పేట దాడి ముప్పు ముంచుకొస్తోంది. ఇటు గాజా నుంచి హమాస్ రాకెట్లను ప్రయోగిస్తూనే ఉంది. అటు ఇజ్రాయెల్ వైమానిక దాడులను చేస్తూనే ఉంది. గాజా సరిహద్దుల్లో బలగాలను మోహరించి యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఇటు లెబనాన్‌వైపూ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇజ్రాయెల్ ఏర్పాటుచేసిన నిఘా కెమెరాలను హెజ్బొల్లా ధ్వంసం చేస్తోంది. ఒకవేళ గాజాలో భూతల దాడులకు దిగితే తామూ యుద్ధంలోకి వస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. మరోవైపు గాజాలో ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. ఆసుపత్రుల్లో బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. ఇక హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఏ క్షణమైనా..
సరిహద్దులో మోహరించిన 3,60,000 మంది ఇజ్రాయెల్ రిజర్విస్టులు గాజాలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు ఏ క్షణమైనా ఆపరేషన్ చేపట్టే అవకాశముంది. ప్రజలంతా ఇళ్లు ఖాళీ చేసి దక్షిణ గాజావైపు వెళ్లడంతోపాటు ఆసుపత్రులు, ఐక్యరాజ్య సమితి శరణార్థ శిబిరాల వద్దకు చేరడంతో.. ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగిస్తోంది. ఇప్పటికే డజన్లకొద్దీ హమాస్ స్థావరాలను ధ్వంసం చేశామని, కమాండ్ సెంటర్లను, రాకెట్ దాడులను నిరోధించామని, మిలిటెంట్ కమాండర్లను హతమార్చామని ఇజ్రాయెల్ వెల్లడించింది.
లెబనాన్ సరిహద్దులో..
లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్తత తీవ్రమవుతోంది. ఆదివారం రాత్రి దక్షిణ లెబనాన్‌లోని కఫార్ కిలా ప్రాంతంలో రెండు క్షిపణులను ఇజ్రాయెల్ డ్రోన్లు కూల్చివేశాయి. తాము హెచ్చరికగానే దాడులు చేస్తున్నామని, యుద్ధంలోకి దిగలేదని హెజ్బొల్లా తెలిపింది. లెబనాన్ సరిహద్దులోని 28 ప్రాంతాల్లోని తమ పౌరులను ఖాళీ చేయించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఇవి సరిహద్దుకు 2 కి.మీ. దూరంలో ఉన్నాయి.
భూతల దాడులు చేస్తే ఊరుకోం: ఇరాన్
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఆపితే బందీలను విడుదల చేయడానికి హమాస్ సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. గాజాపై ఇలా రోజూ దాడులు జరుగుతుంటే వారి విడుదల అసాధ్యమని హమాస్ తెలిపినట్లు ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నాజర్ కనానీ టెహ్రాన్‌లో వెల్లడించారు. ఇజ్రాయెల్ భూతల దాడులకు దిగితే యుద్ధంలోకి తామూ ప్రవేశిస్తామని హెచ్చరించారు. కాగా ఉత్తర ప్రాంతంలో తమను పరీక్షించొద్దని హెజ్బొల్లా, ఇరాన్‌లను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు.
10 లక్షల మంది వలస
గాజాలో 10 లక్షల మంది ఇళ్లను వదిలి వలస వెళ్లారు. వారిలో సగం మంది దక్షిణ గాజావైపు వెళ్లగా మిగిలిన వారు ఐరాస శిబిరాలకు చేరుకున్నారు. ప్రజలు ఆహారం, తాగునీరు లేక అల్లాడుతున్నారు. ఆసుపత్రులు సామర్థ్యానికి మించి పని చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో మొత్తం 2,750 మంది మరణించారని, 9,700 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 455 మంది పాలస్తీనా వాసులు మరణించారు. 856 మంది గాయపడ్డారు. హమాస్ దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెలీలు మరణించారు. 199 మంది బందీలుగా ఉన్నారు.