Vaccine for type-1 diabetes – టైప్-1 డయాబెటిస్‌కు టీకా

మల్టిపుల్ స్లీరోసిస్, టైప్-1 మధుమేహం వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల ఆట కట్టించే దిశగా సరికొత్త టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్‌లను శత్రువులుగా గుర్తించి, వాటిపై దాడి చేయడాన్ని రోగ నిరోధక వ్యవస్థకు సాధారణ టీకాలు నేర్పిస్తాయి. అందుకు భిన్నంగా ప్రత్యేక విలోమ వ్యాక్సిన్‌ను అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రిట్జ్‌కర్ స్కూల్ ఆఫ్ మాలిక్యులార్ ఇంజినీరింగ్ (పీఎంఈ) పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. కొన్ని నిర్దిష్ట కణాలకు సంబంధించి రోగ నిరోధక వ్యవస్థ జ్ఞాపకశక్తిని ఈ టీకా చెరిపేస్తుంది. టైప్-1 మధుమేహం, మల్టిపుల్ స్లీరోసిస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో రోగ నిరోధక వ్యవస్థ.. ఆయా వ్యక్తుల ఆరోగ్యకర కణజాలంపై దాడి చేస్తుంది. సంబంధిత జ్ఞాపకశక్తిని కొత్త వ్యాక్సిన్ చెరిపేస్తుంది కాబట్టి ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి.