UK – ‘లాఫింగ్ గ్యాస్’పై నిషేధం

లాఫింగ్ గ్యాస్‌గా పిలిచే నైట్రస్ ఆక్సైడ్‌ను వినోదభరిత కార్యకలాపాల కోసం వినియోగించడంపై బ్రిటన్ ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది. ఆ డ్రగ్‌ను ఉత్పత్తి చేయడం, సరఫరా, విక్రయించడం వంటివి చేస్తే జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది. ఆరోగ్య సంరక్షణతోపాటు పరిశ్రమల్లో చట్టబద్ధంగా నైట్రస్ ఆక్సైడ్‌ను వినియోగించడాన్ని నిషేధం నుంచి మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. యూకేలో 16-24 ఏళ్ల వయసువారు అత్యధికంగా వినియోగిస్తున్న మూడో డ్రగ్ నైట్రస్ ఆక్సైడ్. దీనిని ఎక్కువగా ఉపయోగించడంవల్ల రక్తహీనత బారిన పడే అవకాశమున్నట్లు ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. దీని తీవ్రత ఎక్కువైతే నరాలు దెబ్బతినడంతోపాటు పక్షవాతం వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.