Type 2 Diabetes – పగటి కాంతితో చికిత్స

సహజసిద్ధమైన పగటి వెలుగులో ఎక్కువసేపు గడపడం వల్ల టైప్-2 మధుమేహానికి చికిత్స చేయవచ్చని నెదర్లాండ్స్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ రుగ్మత దరిచేరకుండా చూసుకోవడానికీ ఇది దోహదపడొచ్చని తేలింది.
పగటి సమయంతోపాటు రాత్రివేళల్లోనూ విధులు నిర్వర్తించాల్సి రావడం వల్ల టైప్-2 మధుమేహం వంటి జీవక్రియ సంబంధ వ్యాధుల తాకిడి పెరుగుతోందని పరిశోధనకు నాయకత్వం వహించిన ఇవో హేబెట్స్ పేర్కొన్నారు. పగటి సమయంలో వచ్చే సహజసిద్ధ కాంతి.. శరీర అంతర్గత జీవ గడియారానికి బలమైన సంకేతం. అయితే పగటి సమయంలో చాలా మంది ఇళ్లు, కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. నిరంతరం కృత్రిమ లైట్లలో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో దీని ప్రభావంపై శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. టైప్-2 మధుమేహం ఉన్నవారిని నిర్దిష్ట సమయం పాటు సహజసిద్ధ, కృత్రిమ కాంతిలో ఉంచారు. ఆ సమయంలో వారికి జీవక్రియకు సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించారు. కృత్రిమ కాంతితో పోలిస్తే సహజసిద్ధ వెలుగుల్లో ఉన్నప్పుడే పరీక్షార్థుల రక్తంలో గ్లూకోజ్ స్థాయి.. ఎక్కువసేపు సాధారణ స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. శరీర జీవ గడియారాన్ని నియంత్రించడంలో పెర్1, క్రై1 అనే జన్యువులు సాయపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అవి సహజసిద్ధ కాంతిలోనే ఎక్కువగా క్రియాశీలమవుతున్నట్లు వివరించారు.-