Trudeau – UAE అధ్యక్షుడు, జోర్డాన్ రాజుతో ‘భారత్’పై చర్చ..

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ దిల్లీతో కయ్యానికి కాలుదువ్విన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ‘‘చట్టాలను సమర్థించడం, గౌరవించడం’పై ఆయన సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉంది. అంతేగాక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్, జోర్డాన్ రాజు అబ్దుల్లాతో ‘భారత్-కెనడా దౌత్య వివాదం’ పై ట్రూడో చర్చించారు. ‘‘యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్‌తో ఫోన్లో మాట్లాడాను. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి మేం ఆందోళన వ్యక్తం చేశాం. పౌరుల ప్రాణాలను రక్షించాల్సిన ఆవశ్యకతపై చర్చించాం. ఇక భారత్ అంశం, చట్టాలను సమర్థించడం, పరస్పరం గౌరవించుకోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను కూడా మేం చర్చించుకున్నాం’’ అని ట్విటర్‌లో ట్రూడో రాసుకొచ్చారు.