There is no arms distribution agreement with Ukraine says Pak – ఉక్రెయిన్‌తో ఎలాంటి ఆయుధాల పంపిణీ ఒప్పందం లేదని పాక్ చెబుతోంది

పాకిస్థాన్ (Pakistan) ఐఎంఎఫ్ ప్యాకేజీ పొందేందుకు ఏకంగా ఉక్రెయిన్ (Ukraine)కు ఆయుధాలను సరఫరా చేస్తోందనే నివేదికలు వెలువడుతున్నాయి. అయితే.. ఈ నివేదికలను పాక్ విదేశాంగశాఖ కార్యాలయం తోసిపుచ్చింది. ఈ మేరకు కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జారా బలోచ్ మాట్లాడుతూ.. అటువంటి ఆరోపణలు పూర్తిగా ఆధార రహితమని, అభూత కల్పనలని ఖండించారు.
‘ఇంటర్‌సెప్ట్’ అనే ఇన్వెస్టిగేటివ్ వెబ్‌సైట్ ఆదివారం ఓ నివేదికను ప్రచురించింది. దీనిలో అమెరికా సాయంతో ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ పొందేందుకు పాకిస్థాన్ రహస్యంగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు విక్రయిస్తోందని పేర్కొంది. అమెరికా ఒత్తిడితోనే పాకిస్థాన్ ఈ సంక్షోభంలో తలదూర్చిందని వెల్లడించింది. దాదాపు ఏడాది నుంచి క్రెమ్లిన్, వైట్ హౌస్ మధ్య సమతౌల్యం పాటించేందుకు యత్నిస్తున్న సమయంలో ఈ నివేదిక బయటకు రావడం ఇస్లామాబాద్‌కు తలనొప్పిగా మారింది.
‘‘కష్టతరమైన ఆర్థిక సంస్కరణల కోసం ఐఎంఎఫ్‌తో చర్చలు విజయవంతంగా జరిగాయి. దీనికి వేరే కోణాలు ఆపాదించడం తగదు. రెండు దేశాల మధ్య సంక్షోభం విషయంలో పాకిస్థాన్ తటస్థ వైఖరిని బలంగా పాటిస్తోంది. ఎవరికీ ఆయుధాలు, మందుగుండు అందించడంలేదు. కఠినమైన ఎండ్ యూజర్ సమాచారం లభించాకే పాక్ ఆయుధాలు సరఫరా చేస్తుంది’’ అని డాన్ పత్రిక వద్ద ముంతాజ్ వివరణ ఇచ్చారు.
ఈ ఏడాది జులైలో ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దిమిత్రి కులేబ పాక్‌లో పర్యటించిన సమయంలో కూడా ఇటువంటి ప్రచారమే జరిగింది. కానీ, అప్పట్లో ఆయన వాటిని తోసిపుచ్చారు. తమ మధ్య ఆయుధ పంపిణీ ఒప్పందం లేదని వివరణ ఇచ్చారు.