Tensions have arisen between China and Taiwan once again – చైనా, తైవాన్లమధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

తైవాన్ (Taiwan) తమ దేశంలోని భాగమేనంటూ వాదిస్తోన్న చైనా (China).. ఎలాగైనా దాన్ని ఆక్రమించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ.. తాజాగా 24 గంటల వ్యవధిలో చైనా సైన్యం ఏకంగా 103 యుద్ధవిమానాలను తైవాన్ దిశగా పంపడం గమనార్హం. వాటిలో 40 యుద్ధవిమానాలు తైవాన్ జలసంధి ‘మధ్య రేఖ’ను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. ఈ రేఖను ఇరుదేశాల మధ్య అనధికారిక సరిహద్దుగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద దుందుడుకు చర్య అని పేర్కొన్న తైవాన్.. ఆ వ్యవధిలో తొమ్మిది చైనా నౌకలనూ గుర్తించినట్లు తెలిపింది.
చైనా చర్యలను కవ్వింపుగా అభివర్ణించిన తైవాన్ రక్షణశాఖ.. ప్రస్తుత ఉద్రిక్త వాతావరణంలో ఇటువంటి మిలిటరీ విన్యాసాలతో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ తరహా ఘటనలకు బాధ్యత వహించడంతోపాటు సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపేయాలని సూచించింది. మరోవైపు.. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. అక్కడ ‘మధ్య రేఖ’ అటూ ఏదీ లేదని, తైవాన్ కూడా చైనాలో భాగమేనని పేర్కొనడం గమనార్హం. గత వారం సైతం చైనా.. తైవాన్ సమీప జలాల్లోకి విమాన వాహక నౌక షాన్‌డాంగ్ సహా యుద్ధనౌకల దండును పంపింది.
ఇదిలా ఉండగా.. తైవాన్‌ను విలీనం చేసుకునేందుకు బీజింగ్ ఇటీవల ఓ ప్రణాళికను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. చైనాలో తీర ప్రావిన్స్ ఫుజియాన్, తైవాన్‌ల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే విధంగా కొత్త బ్లూప్రింట్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరిలో తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ప్రణాళికను ఆవిష్కరించడం గమనార్హం. అయితే, దీనిపై తైవాన్ చట్టప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ఇది ‘హాస్యాస్పదం’ అంటూ డ్రాగన్‌పై మండిపడ్డారు.