#International news

Smartwatch : సీఈఓ ప్రాణాలు కాపాడింది

టెక్నాలజీతో కొన్ని ప్రతికూలతలు ఉన్న మాట వాస్తవమే అయినా.. వాటి వల్ల జరిగే మేలునూ విస్మరించకూడదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. మార్నింగ్‌ జాగింగ్‌కు వెళ్లిన ఓ కంపెనీ సీఈవోను స్మార్ట్‌వాచ్‌ (Smartwatch) కాపాడింది. ఆ వాచ్‌ సాయంతో సమయానికి ఆ సీఈఓ తన భార్యకు సమాచారం ఇవ్వడం.. నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆయన ప్రాణాలు నిలిచాయి. స్మార్ట్‌వాచే తనను కాపాడిందని ఆ సీఈఓనే స్వయంగా పోస్ట్‌ చేశారు.

యూకేకు చెందిన 42 ఏళ్ల పాల్‌ వాఫమ్‌ హాకీ వేల్స్‌ అనే కంపెనీకి సీఈఓ. నిత్యం జాగింగ్‌కు వెళ్లే అలవాటు ఉన్న ఆయన.. ఈ మధ్య ఓ రోజు ఉదయం 7 గంటలకు జాగింగ్‌ వెళ్లారు. అక్కడికి కొన్ని నిమిషాలకే ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే తన చేతికున్న స్మార్ట్‌ వాచ్‌ సాయంతో భార్య లారాకు ఫోన్‌ చేయడంతో ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆమె అక్కడికి చేరుకుంది. తన కారులోనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లడం.. అక్కడి సిబ్బంది కూడా అంతే వేగంగా స్పందించడంతో సీఈఓ ప్రాణాలు నిలిచాయి.

గుండె దమనుల్లో బ్లాకేజీ కారణంగా గుండెపోటు సంభవించిందని వైద్యులు తెలిపారు. అదే ఆస్పత్రిలో శస్త్ర చికిత్స అనంతరం ఆరు రోజుల తర్వాత పాల్‌ తన ఇంటికి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని స్థానిక మీడియాతో పంచుకున్నారు. తాను భారీకాయుడినేమీ కాదని, నిత్యం దృఢంగా ఉండడానికి ప్రయత్నిస్తానని పాల్‌ చెప్పుకొచ్చారు. అయినా తనకు ఇలా జరగడం తనతో పాటు తన ఫ్యామిలీని షాక్‌కు గురి చేసిందని చెప్పారు. ఈ ఒక్కటే కాదు.. గతంలోనూ గుండెపోటు లక్షణాలను స్మార్ట్‌వాచ్‌లు ముందుగానే గుర్తించడంతో పలువురి ప్రాణాలు నిలిచాయి. స్మార్ట్‌వాచ్‌ల్లో ఉండే హార్ట్‌రేట్‌, ఈసీజీ వంటి సెన్సర్లు గుండెపోటు ముప్పును ముందుగానే గుర్తించడంలో సాయపడుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *