Services were interrupted.. Flights were stopped – సర్వీసులకు అంతరాయం కలిగింది.. విమానాలు నిలిచిపోయాయి

ఇంగ్లాండ్‌లోని లండన్ మహా నగరంలో గాట్విక్ (Gatwick) అంతర్జాతీయ విమానాశ్రయం సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో భారీగా విమానాలు నిలిచిపోయాయి. ఇప్పటికే 22 విమానాలను రద్దు చేసినట్లు షార్ట్ నోటీస్ వెలువరించింది. దీంతోపాటు ఈ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన వందలాది విమానాల్లో తీవ్ర జాప్యం నెలకుంటోందని ఫ్లైట్ రాడార్ 24 పేర్కొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కొరత కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. దీంతో నాట్స్ (నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్) ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. శుక్రవారం ఉదయం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి చేరుతుందని తాము ఆశిస్తున్నట్లు గాట్విక్ విమానాశ్రయం ఓ ప్రకటనలో పేర్కొంది.
‘‘నాట్స్ ఎయిర్ ట్రాఫిక్ సేవలు అందించడంలో ప్రపంచ స్థాయిలో పేరున్న సంస్థ. లండన్‌లోని గాట్విక్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ శ్రమను సీనియర్ మేనేజ్‌మెంట్ గుర్తించింది. వేగంగా పునరుద్ధరించడానికి వీలైన ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ టవర్ నిర్మించడానికి నాట్స్‌తో కలిసి పనిస్తున్నాం. సమస్యలను వీలైనంత తగ్గించడమే లక్ష్యం’’ అని విమానాశ్రయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆగస్టు చివరి వారంలో యూకేలోని నాట్స్ (నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసు) తొలుత ఆటోమేటెడ్ ఫ్లైట్ ప్లానింగ్ సిస్టమ్‌లో సమస్యను గుర్తించి కొన్ని గంటల్లోనే దీనిని సరిచేశారు. దీంతో విమానాల షెడ్యూల్ ఆటోమెటిక్ వ్యవస్థలో సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా సిబ్బంది మాన్యువల్‌గా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొన్ని రోజులపాటు ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ ఘటన జరిగి రెండు వారాలైంది. ఈ నేపథ్యంలో మరోసారి గాట్విక్‌లో ఇబ్బంది మొదలు కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.