#International news

Russia attacked Ukraine’s – ఏకైక ప్రధాన నౌకాశ్రయం ఒడెస్సాపై రష్యా దాడి చేసింది.

ఉక్రెయిన్‌(Ukraine)కు ఉన్న ఏకైక ప్రధాన పోర్టు అయిన ఒడెస్సాపై రష్యా (Russia) విరుచుకుపడింది. ఈ దాడిలో పోర్టు, ధాన్యం నిల్వ గోదాములు, ఓ హోటల్‌ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా ఆధీనంలోని క్రిమియా నౌకాదళ స్థావరం ప్రధాన కార్యాలయంపై ఉక్రెయిన్‌ క్షిపణి దాడి చేసిన కొన్ని రోజుల్లోనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. మొత్తం 12 కల్బిర్‌ క్షిపణులు, 19 డ్రోన్లు, రెండు ఒనెక్స్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో కల్బిర్‌ క్షిపణులను సబ్‌మెరైన్లు, నౌకలపై నుంచి ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు వెల్లడించాయి. వీటిల్లో అత్యధికశాతాన్ని తాము కూల్చివేశామని కీవ్‌ వర్గాలు పేర్కొన్నాయి.  

ఈ దాడిలో ఒడెస్సా నౌకాశ్రయంలోని ఆహార ధాన్యాల గోదాములు, ఇతర పోర్టు మౌలిక వసతులు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ధాన్యపు ఒప్పందం అమలుకు అవసరమైన పరికరాలు, ప్రదేశాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్‌ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఒనెక్స్‌ క్షిపణులు పోర్టును బాగా దెబ్బతీసినట్లు సమాచారం. కాకపోతే ప్రాణనష్టం నుంచి ఉక్రెయిన్‌ తప్పించుకొంది. ఈ దాడుల్లో ఓ హోటల్‌ కూడా తీవ్రంగా దెబ్బతింది. 

నల్లసముద్రంలోని అంతర్జాతీయ జలాలు కాకుండా.. పొరుగు దేశాల జలాల్లో నుంచి మాత్రమే ధాన్యం రవాణ చేసేలా మార్గాలను ఉక్రెయిన్‌ ప్రస్తుతం పరీక్షిస్తోంది. ఇందుకోసం నాటో సభ్యదేశాలైన బల్గేరియా, రొమానియా తీరాలను వాడుకుంటోంది. ఈ మార్గంలో రవాణ చేసిన తొలి రెండు షిప్‌మెంట్‌లు తాజాగా తుర్కియే చేరుకొన్నాయి. ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థల్లో ఉక్రెయిన్‌, రష్యా రెండూ కీలకమైనవే. మరోవైపు ఉక్రెయిన్‌ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను తాము కూల్చేసినట్లు రష్యా ప్రకటించింది. వీటిల్లో కొన్ని క్రిమియా దిశగా దూసుకొచ్చాయని పేర్కొంది. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *