Pakistan: అఫ్గాన్ సైనికుడి కాల్పుల్లో ఇద్దరు పాక్ పౌరులు మృతి

పాకిస్థాన్ (pakistan), అఫ్గానిస్థాన్ (afghanistan) సరిహద్దు వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. అఫ్గాన్ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ పౌరులు మృతి చెందారు. అందులో 12 ఏళ్ల బాలుడున్నాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటన బెలూచిస్థాన్‌లోని ఫ్రెండ్షిప్ గేట్ (friendship gate)గా పిలిచే చామన్ సరిహద్దు (chaman border) వద్ద చోటు చేసుకుంది. ఈ సరిహద్దు గేటు నుంచే అఫ్గాన్ పౌరులు పాకిస్థాన్‌లోకి రాకపోకలు సాగిస్తుంటారు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో అఫ్గాన్‌లోకి ప్రవేశిస్తున్న ఇద్దరు పాక్ పౌరులపై సైనికుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన అఫ్గాన్ సైన్యం.. కాల్పులకు తెగపడ్డ సైనికుడిని అదుపులోకి తీసుకొంది. మృతదేహాలను చామన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై పాకిస్థాన్ సైన్యం స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అఫ్గాన్ ప్రభుత్వం వారి సైన్యాన్ని అదుపులో ఉంచుకోవాలని, సైనికులకు క్రమక్షశిక్షణ నేర్పించాలని సూచించింది. ‘‘ఇప్పటికీ పాక్ ప్రభుత్వం ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి, అభివృద్ధికి, నిర్మాణాత్మక ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడానికి కట్టుబడి ఉంది. కానీ, ఇలాంటి అవాంఛిత ఘటనలు ఇరు దేశాల మధ్య సంబంధాలకు హాని కలిగిస్తాయి’’అని ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు తమ దేశంలో అక్రమంగా నివసిస్తోన్న అఫ్గానిస్థాన్ పౌరులు నవంబర్ 1లోపు దేశాన్ని విడిచివెళ్లిపోవాలని పాక్ ప్రభుత్వం అక్టోబర్ 3న హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలు జారీ అయిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం