NIT Student suicide.. – ఎన్‌ఐటీ విద్యార్థి ఆత్మహత్య..

విద్యార్థి ఆత్మహత్య ఘటనతో ఎన్‌ఐటీ(NIT) ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థులు చేస్తోన్న ఆందోళనను పోలీసులు కట్టడి చేసే క్రమంలో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ దృశ్యాలు అస్సాం(Assam)లోని ఎన్‌ఐటీ సిల్చార్ క్యాంపస్‌లో వెలుగులోకి వచ్చాయి. (NIT Silchar suicide)
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఒకరు ఎన్‌ఐటీ సిల్చార్( NIT Silchar)లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ మూడో సెమిస్టర్ చదువుతున్నాడు. అతడు బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయలేకపోయాడు. దాంతో తర్వాత సెమిస్టర్‌కు రిజిస్టర్ చేసుకోవడం కోసం అతడు చేసిన అభ్యర్థనను కళాశాల యంత్రాంగం తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే ఆందోళనకు గురైన అతడు హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. ఈ మృతితో విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వారంతా రిజిస్ట్రార్ అధికారిక నివాసాన్ని చుట్టుముట్టారు. శుక్రవారం రాత్రి నిరసనలు ఉద్రిక్తతలకు దారితీయడంతో వారిని చెదరగొట్టేందుకు తాము స్వల్పస్థాయిలో బలగాలను రంగంలోకి దించామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ.. శనివారం కూడా నిరసనలు కొనసాగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.
ఈ క్రమంలో కఛాడ్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ఎన్‌ఐటీ యంత్రాంగం మధ్య అత్యవసర సమావేశం జరిగిందని సమాచారం. ఈ పరిస్థితులు సద్దుమణిగేవరకు విద్యా సంస్థను మూసివేయనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఎన్‌ఐటీ యాజమాన్యంపై విద్యార్థులు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థ తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలను వ్యతిరేకించారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశామని, ఎన్‌ఐటీ డైరెక్టర్‌తో మాట్లాడాలనుకున్నామని.. కానీ తమపై పోలీసుల్ని ప్రయోగించారని వెల్లడించారు.
విద్యార్థి మృతిని ఎన్‌ఐటీ యంత్రాంగం ధ్రువీకరించింది. మొదటి సంవత్సరం నుంచే ఆ విద్యార్థికి చదువు విషయంలో సమస్యలు ఉన్నాయని, బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయలేక నిస్పృహకు గురై ఉంటాడని పేర్కొంది. అతడి మానసిక స్థితిని తోటి విద్యార్థులు గుర్తించి ముందుగానే తమకు తెలియజేయాల్సిందని వ్యాఖ్యానించింది. ఇక ఆ మృతిని అసహజ మరణంగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.zz