Niger : నైగర్ జిహాదీల దాడిలో 29 మంది సైనికుల మృతి

మాలీ సరిహద్దుల్లోని నైగర్‌లో జిహాదీలు జరిపిన దాడిలో కనీసం 29 మంది సైనికులు మరణించినట్లు సైనిక ప్రభుత్వం తెలిపింది. క్లియరెన్స్ ఆపరేషన్ కోసం మోహరించిన సైనికులే లక్ష్యంగా వంద మందికిపైగా తీవ్రవాదులు దేశీయ పేలుడు పదార్థాలతో దాడి చేశారని నైగర్ రక్షణ శాఖ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ సలీఫో సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. తాజాగా జరిగిన దాడి.. నైగర్ సైనికులే లక్ష్యంగా వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండో దాడి అని చెప్పారు. నైగర్‌లో అధికారాన్ని సైన్యం హస్తగతం చేసుకున్నాక తీవ్రవాద ఘటనలతో సంబంధం ఉన్న హింస 40 శాతం మేర పెరిగినట్లు ఆర్మ్‌డ్ కాన్‌ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ప్రాజెక్ట్ అనే సంస్థ తెలిపింది.