Libya : A Monster Wave Of About 23 Feet Hit The Town – లిబియా: సుమారు 23 అడుగుల అల పట్టణాన్ని తాకింది

లిబియా (Libya)లోని డేర్నా(Derna)లో కేవలం ఒక్కే ఒక్క రాకాసి అల దాదాపు 20,000 మంది ప్రాణాలను తీసిందని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ (ఐసీఆర్‌సీ) నిపుణులు చెబుతున్నారు. ఈ అల ఎత్తు దాదాపు 7 మీటర్లు ఉందని పేర్కొన్నారు. మరికొన్ని పల్లపు ప్రాంతాల్లో ఈ అల ఎత్తు దాదాపు ఆరు అంతస్తుల భవనం అంతకు చేరుకొంది. అత్యంత వేగంతో దూసుకొచ్చిన బురద నీరు.. పెద్ద పెద్ద భవనాలను కుప్పకూల్చి ప్రజలను ఈడ్చుకొని సముద్రంలోకి తీసుకెళ్లిపోయింది. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ అక్కడి సముద్ర తీరంలో తేలియాడుతున్న మృతదేహాలు స్థానికులకు కనిపిస్తూనే ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈ జల ప్రళయం సెప్టెంబరు 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు చోటుచేసుకొంది. ఆ సమయంలో ప్రజలు గాఢనిద్రలో ఉండటంతో తప్పించుకొనే అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. డ్యామ్ బద్దలైన వెంటనే ఓ రాకాసి అల పర్వత కనుమలను దాటుకొని వచ్చి ఊరిపై పడింది. ఈ ఊరిలో దాదాపు 1,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. డేర్నా నగరంలో 1942 నుంచి ఐదు భారీ వరదలు వచ్చాయి. చివరిసారిగా 2011లో ఈ ప్రాంతాన్ని వరద ముంచెత్తింది.
ఇప్పటికే 11,000 మృతదేహాలను గుర్తించగా.. మరికొన్ని వేల మంది ఆచూకీ తెలియడంలేదు. ఐసీఆర్‌సీ 6,000 బాడీ బ్యాగ్‌లను పంపిణీ చేసింది. దాదాపు 30,000 మంది ఇళ్లు కోల్పోయి వీధిన పడ్డారు. ఈ విధ్వంసం నుంచి బయటపడాలంటే డేర్నా నగరానికి కొన్ని ఏళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
నిర్లక్ష్యంతో ముంచుకొచ్చిన విపత్తు
ఇక తాజాగా బద్దలైన రెండు డ్యామ్‌లను 1973, 1977లో యుగోస్లావ్ కంపెనీ నిర్మించింది. డెర్నాలోని డ్యామ్ 75 మీటర్ల ఎత్తుతో 18 మిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యంతో ఉంది. ఇక రెండో డ్యామ్ అయిన మన్సోర్ ఎత్తు 45 మీటర్లు. దీనిలో 1.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు పడుతుంది. ఈ రెండింటిని 2002లో చివరిసారి మెయింటెనెన్స్ చేశారు. డేర్నా డ్యామ్ నుంచి వరద ముప్పు పొంచి ఉందని ఇప్పటికే సెభా యూనివర్శిటీ పరిశోధన పత్రాన్ని ప్రచురించింది.