Israel – కాస్త తగ్గుతోందా..?

హమాస్(Hamas)ను భూస్థాపితం చేసేవరకు గాజాపై తమ దాడులు ఆపమన్న ఇజ్రాయెల్(Israel) .. భీకర ఘర్షణలకు ప్రదేశాల వారీగా స్వల్ప సడలింపులు ఇచ్చేందుకు మాత్రం ముందుకువచ్చింది. మానవతా సాయం, బందీల విడుదల కోసం గాజాలో వ్యూహాత్మక విరామాలను పరిశీలిస్తామని వెల్లడించింది. (Israel Hamas Conflict)
‘మానవతా సాయాన్ని సులభతరం చేయడానికి, బందీలను విడిపించేందుకు వ్యూహాత్మక స్వల్ప విరామాలను మా దేశం పరిశీలిస్తోంది’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) తెలిపారు. అమెరికా శ్వేతసౌధ ప్రతినిధి జాన్ కిర్బీ కూడా ఈ విరామాల గురించి ప్రస్తావించారు. ఈ యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు బైడెన్, నెతన్యాహు మధ్య జరుగుతున్న చర్చల గురించి వివరిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికీ, కాల్పుల విమరణకు మాత్రం ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది. యుద్ధం తర్వాత సుదీర్ఘకాలం గాజా భద్రతను తాము చూడాల్సి వస్తుందని భావిస్తున్నట్లు నెతన్యాహు అభిప్రాయం వ్యక్తం చేశారు.
గాజాలో ఇజ్రాయెల్ భూతల దాడుల్ని విస్తరిస్తోంది. హమాస్ మిలిటెంట్లు అధికంగా ఉండే ఉత్తరగాజాలో పూర్తి స్థాయి భూతల దాడికి సిద్ధమవుతోంది. అటు హమాస్ కూడా పోరాటానికి సిద్ధంగానే ఉంది. దీంతో వీధి వీధినా పోరాటం జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల భారీగా ప్రాణ నష్టం సంభవించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ సోమవారం ఫోన్లో మాట్లాడుకున్నారు.
గాజాలో ఇజ్రాయెల్ చర్యలకు ముగింపు పలకడానికి భారత్ తన శక్తిని ఉపయోగించాలని రైసీ కోరారు. ఇజ్రాయెల్, పాలస్తీనా విషయంలో ఎంతోకాలంగా అనుసరిస్తున్న విధానానికే తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మోదీ ఆయనకు గుర్తు చేశారు.