Israel-Hamas: ‘గాజాపై వైమానిక దాడులు ఆపితే.. బందీల విడుదల’..

ఇజ్రాయెల్ (Israel)పై మెరుపుదాడి చేసి కొందరు పౌరులను బందీలు (hostages)గా పట్టుకెళ్లిన హమాస్ (Hamas) గ్రూప్.. ఇప్పుడు వారిని విడిచిపెట్టేందుకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం ఇజ్రాయెల్‌కు షరతు విధించినట్లు సమాచారం. గాజాలో బాంబు దాడులు ఆపితే బందీలందరినీ విడిచిపెట్టేస్తామని హమాస్ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లు ‘ఎన్‌బీసీ న్యూస్’ కథనం వెల్లడించింది.
‘గాజాలో ఇజ్రాయెల్ బలగాలు తమ సైనిక దురాక్రమణ, వైమానిక దాడులను నిలిపివేస్తే.. గంటలోనే మా వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరులను విడిచిపెడతాం. ప్రస్తుతం వారిని విడిచిపెట్టేందుకు సురక్షిత ప్రదేశం లేదు’’ అని హమాస్ సీనియర్ అధికారి చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. ఆ అధికారి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.
అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడిన హమాస్.. తర్వాత ఆ దేశంలోకి చొరబడి భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో కొంతమందిని హమాస్ కిడ్నాప్ చేసి వారిని గాజాలో బంధించింది. హమాస్ చెరలో దాదాపు 200 మంది బందీలుగా ఉన్నట్లు ఇటీవల ‘ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్’ ధ్రువీకరించింది.
మరోవైపు, హమాస్ నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని గాజా (Gaza)పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుపడింది. దీంతో అక్కడి పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఈ క్రమంలోనే గాజాలో మంగళవారం ఓ ఆసుపత్రి వద్ద భీకర పేలుడు సంభవించింది. ఈ ఘటనకు ఇజ్రాయెల్ కారణమని హమాస్ ఆరోపించగా.. దాన్ని ఐడీఎఫ్ ఖండించింది. పీఐజే ఉగ్ర సంస్థ ప్రయోగించిన రాకెట్ గురితప్పి ఆసుపత్రిపై పడిందని పేర్కొంటూ వీడియోలు కూడా విడుదల చేసింది.