Israel-Hamas : గాజా ఆసుపత్రిపై దాడి

ఇజ్రాయెల్ (Israel) దాడులతో విలవిల్లాడుతున్న గాజా (Gaza)లో మంగళవారం ఘోర ఘటన చోటుచేసుకొంది. అల్ అహ్లి ఆసుపత్రి (Attack on Hospital)లో పేలుడు సంభవించి 500 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటనతో పశ్చిమాసియా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కాగా.. ఈ దారుణానికి ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని హమాస్ (Hamas) ఆరోపించగా.. దాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఖండించారు. అది ఉగ్రమూకల దుశ్చర్యే అని దుయ్యబట్టారు.
ఐడీఎఫ్ కాదు: నెతన్యాహు
‘‘ఈ విషయాన్ని యావత్ ప్రపంచం తెలుసుకోవాలి. గాజాలోని అనాగరిక ఉగ్ర మూకలే.. అక్కడి ఆసుపత్రిపై దాడి చేశాయి. ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) కాదు. మా పిల్లలను అతి దారుణంగా హత్య చేసిన ఆ ఉగ్రవాదులు.. ఇప్పుడు వారి పిల్లలను కూడా చంపేస్తున్నారు’’ అని నెతన్యాహు ఆరోపించారు. అటు ‘ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్’ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఆసుపత్రి సమీపంలో పీఐజే మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్ గురితప్పి ఆసుపత్రిలో పేలుడు సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు ఐడీఎఫ్ అధికారిక ఎక్స్ (ట్విటర్)ఖాతాలో ఓ వీడియో, కొన్ని పోస్టులు చేసింది.
మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో గాజాలో మరణాలు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 3,200 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 11వేల మంది గాయపడినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అటు గాజా ఆసుపత్రి ఘటనపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.