Israel-Hamas – హమాస్ ఆర్థిక మూలాలపై గురి..

ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరు (Israel Hamas conflict) కొనసాగుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించింది. హమాస్ కీలక సభ్యుల ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలువురి హమాస్ సభ్యుల బృందంపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు గాజా, సుడాన్, తుర్కియే, అల్జీరియా, ఖతర్‌లలో ఉన్న హమాస్ సభ్యుల ఆర్థిక మూలాలపై ఆంక్షలు విధించినట్లు అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ ట్రెజరీ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న వేళ.. అగ్రరాజ్యం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
‘చిన్నారులతో సహా ఇజ్రాయెల్ పౌరులపై ఇటీవల క్రూరమైన హత్యాకాండకు పాల్పడిన నేపథ్యంలో హమాస్ మిలిటెంట్లకు ఆర్థిక సహకారం అందించే వ్యక్తులు, సంస్థలపై అమెరికా నిర్ణయాత్మక, తక్షణ చర్యలు తీసుకొంటోంది’ అని అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ ట్రెజరీ వెల్లడించింది. హమాస్ ఉగ్రవాదుల నిధుల సేకరణ, వినియోగ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్యలను కొనసాగిస్తూనే ఉంటామని ట్రెజరీ విభాగానికి చెందిన విదేశీ అస్తుల నియంత్రణ కార్యాలయం స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో ఈ ఆంక్షల సంఖ్యను మరింత పెంచేందుకు గాను ఆ ప్రాంతంలో ట్రెజరీ అధికారులు పర్యటించనున్నట్లు తెలిపింది. ఖతార్‌కు చెందిన ‘సీక్రెట్ హమాస్ ఇన్వెస్టిమెంట్ పోర్ట్‌ఫోలియో’ ఆర్థిక సంస్థతోపాటు గాజా కేంద్రంగా పనిచేస్తోన్న ఓ వర్చువల్ కరెన్సీ ఎక్స్ఛేంజీ వంటి సంస్థలు అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్నాయి.
మరోవైపు, ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులకు తెగబడిన హమాస్ మిలిటెంట్లను ఎదుర్కొనేందుకు నెతన్యాహు ప్రభుత్వం ఇప్పటికే దాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో గాజాను దిగ్బంధం చేయడంతోపాటు భీకర దాడులతో అక్కడి వందలాది భవనాలను నేలమట్టం చేసింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ దాడుల కారణంగా దాదాపు పది లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు అవసరమైన పూర్తి సాయాన్ని అమెరికా అందిస్తుందని హామీ ఇచ్చారు.