Indonesia – వణికించిన వరుస భూ ప్రకంపనలు..!

ఇండోనేషియా మరోసారి ఉలిక్కిపడింది. శక్తిమంతమైన భూ ప్రకంపనలు (Earthquake) ఇండోనేషియా దీవులను వణికించాయి. వీటిలో కొన్ని రిక్టర్ స్కేలుపై 6.9, 7.0 తీవ్రతతో నమోదు కాగా.. మరో రెండుసార్లు 5.1 తీవ్రతతో సంభవించాయి. ఇలా వరుసగా తీవ్ర స్థాయిలో భూమి కంపించినప్పటికీ.. సునామీ (Tsunami) ప్రమాదం లేదని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం వెల్లడించింది. అయితే, మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. భూకంపం నేపథ్యంలో అక్కడ ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, మలుకు ప్రావిన్సులోని తువాల్ పట్టణానికి 341 కి.మీ దూరంలో 6.9తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉన్నట్లు అంచనా. అదే ప్రాంతంలో మరోసారి 7.0 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం వచ్చింది. అనంతరం 5.1 తీవ్రతతో మరో రెండుసార్లు ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలు కొన్ని నిమిషాల పాటు వచ్చినట్లు తనింబర్ దీవుల్లోని గ్రామాల ప్రజలు తెలిపారు. అయినప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదని స్థానిక జాతీయ విపత్తు నియంత్రణ సంస్థ వెల్లడించింది. తనింబర్ దీవులకు సమీపంలో బందా సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. అక్కడ దాదాపు 1.27లక్షల జనాభా నివసిస్తున్నారు.