India-Canada differences that started on the stage of the G20 summit have become more divisive – జీ20 వేదికపై మొదలైన భారత్-కెనడా విభేదాలు మరింత చిచ్చు రేపాయి

జీ20 సదస్సు వేదికగా రాజుకొన్న భారత్-కెనడా విభేదాలు నేడు మరింత భగ్గుమన్నాయి. గత నెల ఖలిస్థానీ మద్దతుదారులు బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో లక్ష్మీనారాయణ మందిర్‌ను ధ్వంసం చేసి.. ‘‘జూన్ 18 హత్యపై కెనడా దర్యాప్తు చేస్తుంది’’ అని పోస్టర్లు అంటించారు. ఇప్పుడు కెనడా ప్రధాని అదే వాదన తెరపైకి తీసుకొచ్చారు. దీని వెనుక భారత్ హస్తం ఉందని ట్రూడో తాజాగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ హత్యకు సంబంధించి ఓ భారత దౌత్యవేత్తను తమ దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించడంతో ఈ విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. వీటన్నింటి వెనుక ట్రూడో రాజకీయ బలహీనత కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఓ పార్టీ మెప్పు కోసం కెనడా ప్రధాని.. మొదట్నుంచీ ఖలిస్థానీ విషయంలో పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
2021 తర్వాత నుంచి ట్రూడో ప్రభుత్వ రాజకీయ బలహీనత ఖలిస్థానీ వేర్పాటువాదులకు ఆయుధంగా మారింది. 2021 ఎన్నికల్లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఉన్న మొత్తం 338 స్థానాల్లో ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ సీట్లు 177 నుంచి 150కి తగ్గాయి. అదే సమయంలో కన్జర్వేటీవ్ పార్టీకి 121, నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ)కి 24, బ్లాక్ క్యూబెక్స్‌కు 32, గ్రీన్ పార్టీకి 3, స్వతంత్ర్య అభ్యర్థికి ఒకటి చొప్పున సీట్లు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ట్రూడోకు మరికొన్ని సీట్ల అవసరం వచ్చింది. దీంతో జగ్మీత్ సింగ్ ధాలివాల్ (జిమ్మీ) నేతృత్వంలోని ఎన్‌డీపీ మద్దతు తీసుకొన్నారు. ఎన్‌డీపీ నాయకులు ఇప్పటికే పలు మార్లు ఖలిస్థానీ వేర్పాటువాదులకు, వారి ఎజెండాకు మద్దతు పలికారు. 2013లో జగ్మీత్‌కు భారత్ వీసాను తిరస్కరించింది. ప్రస్తుతం అటువంటి వ్యక్తి నేతృత్వంలోని పార్టీ ట్రూడో ప్రభుత్వానికి ప్రాణవాయువు అందిస్తోంది. ఈ జగ్మీత్ సింగ్ ఖలిస్థానీ వేర్పాటువాదానికే పరిమితం కాలేదు.. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగింపును కూడా వ్యతిరేకించాడు.
కెనడా ఏదో అనామక దేశమైతే భారత్‌కు పెద్ద ఇబ్బందికాదు.. కానీ, అది ప్రపంచంలోని సంపన్న దేశాల కూటమి అయిన జీ7 సభ్యదేశం. నాటోలో కూడా కెనడాకు సభ్యత్వం ఉంది. ఇలాంటి ప్రభావవంతమైన దేశంలోని ప్రభుత్వం ఖలిస్థానీ మద్దతుదారులతో నడుస్తుండటంతో భారత్‌కు ఇబ్బందికరంగా మారింది.