Hollywood : ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల్ని ఖండించింది

ఇజ్రాయెల్ (Israel) పై హమాస్ (Hamas) దాడుల్ని హాలీవుడ్ (Hollywood) ఖండించింది. ఉగ్రవాదులు చేసింది ఒక పాశవిక చర్య అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలని పలువురు సినీ తారలు పిలుపునిచ్చారు. ఈ మేరకు క్రియేటివ్ కమ్యూనిటీ ఫర్ పీస్ సంస్థ రాసిన లేఖపై 700కుపైగా సినీ తారలు సంతకాలు చేశారు.
‘‘హమాస్‌కు చెందిన వ్యక్తులు అమాయక ప్రజల్ని హత్య చేశారు. చిన్న పిల్లల్ని, పెద్దల్ని అపహరించి దారుణంగా చంపేశారు. ఇది ఉగ్రవాదం.. రాక్షసత్వం. హమాస్ చర్యలు ఎవరూ సమర్థించలేనివి. ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలి. సినిమా రంగంలోని అందరూ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవాలి. సాధ్యమైతే ఉగ్రవాద సంస్థతో మాట్లాడి బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు ప్రయత్నించండి’’అని లేఖలో పేర్కొన్నారు. ఈ బహిరంగ లేఖపై ‘వండర్ విమెన్’ హీరోయిన్ గాల్ గడొట్, జెమీ లీ కర్టీస్, క్రిస్ పైన్, మైఖేల్ డాగ్లస్, జెర్రీ సైన్‌ఫెల్డ్ సహా 700కిపైగా సినీ తారలు సంతకాలు చేశారు. ఇప్పటికే చాలా మంది తారలు వ్యక్తిగతంగా సోషల్‌మీడియా వేదికగా హమాస్ దాడుల్ని ఖండించి.. ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపారు. తాజాగా వందల మంది తారలు కలిసి ఓ బహిరంగ లేఖ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్లతో మెరుపు దాడి చేసింది. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలతో వందలాది మంది ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందిని హమాస్ ఉగ్రవాదులు తమ బందీలుగా చేసుకున్నారు. దీంతో హమాస్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగింది. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.