#International news

Hamas: అమెరికా ప్రతినిధుల సభలో అరుదైన ఘటన..

అమెరికా ప్రతినిధుల సభలో అరుదైన ఘటన చోటు చేసుకొంది. పాలస్తీనా మూలాలున్న ఏకైక సభ్యురాలు రషీద త్లైబ్‌ ఇజ్రాయెల్‌-హమాస్‌ వార్‌పై మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ దశలో ‘నదుల నుంచి సముద్రాల వరకు’ అనే పదం వాడారు. ఇజ్రాయెల్‌ నిర్మూలనను సూచించే విధంగా దీనిని వాడారంటూ చాలా మంది సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రసంగాన్ని సెన్సార్‌ చేసేందుకు ఓటింగ్‌ నిర్వహించారు. దీనిలో 234-188 మెజార్టీతో దీనికి ఆమోదం లభించింది. ముఖ్యంగా రిపబ్లికన్లు పూర్తిగా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా.. 22 మంది డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యుల మద్దతు కూడా లభించింది. రషీదా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని రిపబ్లికన్లు విమర్శించారు. 

ఈ చర్చ జరుగుతున్న సమయంలో రషీద ఓ దశలో భావోద్వేగానికిలోనై.. గాజాలో వైమానిక దాడులు ఆపాలని కోరారు. సంక్షోభంలో చిక్కుకొన్న పాలస్తీనా, ఇజ్రాయెల్‌ పిల్లల విషయంలో తనకు ఎలాంటి భేదం లేదని వివరణ ఇచ్చారు. తాను ఇజ్రాయెల్‌ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమని.. అంతేకానీ అక్కడి ప్రజలకు కాదని తెలిపారు. అక్కడ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోందని పేర్కొన్నారు. ‘‘మీరు నా మాటలు సెన్సార్‌ చేయగలరు.. వారి గళాలను మూయించలేరు’’ అని వ్యాఖ్యానించారు.   

ఇక గతవారం హమాస్‌, పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ మద్దతు దారులపై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రతినిధుల సభ తీర్మానించింది. తాజాగా దీనిపై నేడు మలేషియా ప్రధాని స్పందించారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *