‘Glow in Dark’ – ‘గ్లో ఇన్ డార్క్’

వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా (America) అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.. 2024 ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణ నిమిత్తం ఆయన మరో కొత్త ప్రయోగంతో ముందుకు వచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక ఎక్స్ (ట్విటర్ ) ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
బైడెన్ తన అధికారిక ప్రచార దుకాణంలో ‘గ్లో ఇన్ డార్క్’ (Glow In Dark) అనే మగ్‌లను పరిచయం చేస్తూ.. ‘ఈ మగ్ కొనమని అందరిని అడుగుతున్నాను. కానీ ఒకరు మాత్రం కచ్చితంగా కొనరని నాకు తెలుసు ’ అని రాసుకొచ్చారు.
వీడియోలో.. జో బైడెన్ ముఖాన్ని ప్రింట్ చేసిన మగ్‌లో నీళ్లు పోయగానే కళ్లజోడు మాయమై.. ఎర్రటి లేజర్ కిరణాల మాదిరిగా అధ్యక్షుడి కళ్లు మాత్రమే కనిపిస్తాయి. బైడెన్ అధికారిక ప్రచార దుకాణంలో ఈ మగ్స్ మాత్రమే కాకుండా అధ్యక్షుడి ముఖంతో ఉన్న టీషర్టులు, స్టిక్కర్లు, ఇంకా అనేక వస్తువులు ఉన్నాయి. రంగు మారుతున్న మగ్‌ను బైడెన్ విడుదల చేయడంతో నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
‘ఈ మగ్ నాకు కావాలి’, ‘అద్భుతమైన మార్కెటింగ్’, ‘ఈ మగ్ ప్రతిరోజూ ఉదయం నా కాఫీతో సరదాగా ఉంటుంది’, ‘ఆ మగ్ తీసుకున్న సిబ్బందికి జీతం పెంచండి’ అని రాసుకొచ్చారు.
అమెరికాలో ఎన్నికల ప్రచారం కోసం నిధుల సేకరణ నిమిత్తం కొన్ని వస్తువులను మార్కెట్‌లో ప్రచారం చేసి అమ్ముతుంటారు. 2022లో ఇలాంటివి ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. ఇంతకుముందు బైడెన్ నిధుల సేకరణకు ‘డార్క్ బ్రాండన్’ (Dark Brandon) తీసుకురాగా దానిపై ట్రోల్స్ ఎక్కువగా రావడంతో ‘గ్లో ఇన్ డార్క్’ తో ముందుకొచ్చారు.