#International news

GAZA – మత్తు మందు ఇవ్వకుండానే చిన్నారులకు శస్త్ర చికిత్సలు..

గాజాలో వైద్య సామగ్రి అందుబాటులో లేకపోవడంతో అనస్థీషియా (మత్తు మందు) ఇవ్వకుండానే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. కనీసం గాయాలు శుభ్రం చేసుకోవడానికీ నీరు లేకపోవడంతో గాయాలపాలైనవారు నరకం చూస్తున్నారు.

గాజాలో తమ ప్రాణాలు పోతాయని తెలిసినా పాలస్తీనా వైద్యులు, నర్సులు యుద్ధ క్షేత్రంలో సేవలందిస్తున్నారని, వారే నిజమైన హీరోలని అమెరికాకు చెందిన నర్సు ఎమిలీ కల్లాహన్‌ పేర్కొన్నారు. గాజాలో మొన్నటివరకూ సేవలందించిన ఆమె.. అక్కడ ఎదురవుతున్న సవాళ్లు, పౌరుల దీనస్థితి గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘దక్షిణ గాజాలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఖాన్‌ యూనిస్‌ కేంద్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దాదాపు 50వేల మంది ఉంటే నాలుగు టాయిలెట్లే ఉన్నాయి. రోజుకు 4 గంటలే నీటి సరఫరా జరుగుతోంది. అసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పిల్లల్ని వెంటనే డిశ్చార్జి చేయాల్సి వస్తోంది. కాలిన గాయాలు, స్వల్పంగా కాళ్లు, చేతులు విరిగిన చిన్నారులు అటూ ఇటు తిరుగుతుండటం కలచివేస్తోంది. సాయం కోసం వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నప్పటికీ.. వైద్య పరికరాల సరఫరా లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. నీరు, ఆహారం ముప్పు ఏర్పడింది. స్థానిక సిబ్బంది రక్షించకపోతే మేము చనిపోయేవాళ్లం. మేమున్న ప్రాంతాల మీదా దాడులు జరుగుతున్నాయి. గాజాలో సురక్షిత ప్రదేశమంటూ ఏదీ లేదు. ప్రతి చోటా బాంబులు కురిపిస్తున్నారు. అయినప్పటికీ పాలస్తీనా సిబ్బంది అక్కడే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు’ అని అమెరికన్‌ నర్సు వివరించారు. సంక్షోభ సమయాల్లో మానవతా సేవలందించే ‘డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలో మేనేజర్‌గా ఎమిలీ పని చేస్తున్నారు. గాజాలోని అనేక ప్రాంతాల్లో 26 రోజులపాటు ఆమె సేవలందించారు. తాజాగా అక్కడి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఆమె తిరిగి అమెరికాకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో ఆమె గాజాలోని దీనస్థితిని వివరించారు.

గాజాలో హమాస్‌ బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టాలని కోరుతూ మంగళవారం సాయంత్రం జెరూసలెంలోని పశ్చిమ గోడవద్ద బందీల బంధువులు, వారి మద్దతుదారులు ఆందోళన నిర్వహించారు. పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ వారు బందీల విడుదలకు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *