France – విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

ఫ్రాన్స్‌లో ఒకేసారి పలు విమానాశ్రయాలకు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆయా ఎయిర్‌పోర్టులను ఖాళీ చేయించిన అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. ఈ బెదిరింపులు రావడం గమనార్హం. ఫ్రాన్స్‌లో లిల్లె ఎయిర్‌పోర్టుకు తొలుత బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది విమానాశ్రయాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే బ్యూవైస్, టోలౌస్, నైస్, లియాన్, నాంటెస్ ఎయిర్‌పోర్టులకు కూడా ఈ తరహా బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా ఆ విమానాశ్రయాలను ఖాళీ చేయించారు. ఏం జరుగుతుందో అర్థం గాక.. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా.. నైస్ ఎయిర్‌పోర్టులో ఓ అనుమానాస్పద బ్యాగు కూడా కన్పించినట్లు ఆ విమానాశ్రయం తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినట్లు పేర్కొంది. మరోవైపు, లిల్లె ఎయిర్‌పోర్టులోనూ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి.
వెర్సైల్స్ ప్యాలెస్ నుంచి సందర్శకుల తరలింపు
భద్రతా కారణాలతో బుధవారం ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత వెర్సైల్స్ ప్యాలెస్ నుంచి సందర్శకులను ఖాళీ చేయించారు. ఈ మేరకు రాజకోట నిర్వాహకులు ట్విటర్‌లో వెల్లడించారు. ఈ పరిస్థితిపై సందర్శకులకు క్షమాపణలు తెలిపారు. ఇటీవల కాలంలో ఇలా జరగడం ఇది మూడోసారి.