#International news

Fake Heart Attack – 20కి పైగా రెస్టారెంట్లకు టోపీ..

గుండెపోటు (Heart Attack) నాటకమాడి తాను తిన్న ఆహారానికి డబ్బులు చెల్లించకుండా వరుస రెస్టారెంట్‌లను ఏమారుస్తున్న ఓ ఘనుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. స్పెయిన్‌ (Spain)లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి స్పెయిన్‌లో గత కొన్ని రోజులుగా కొన్ని రెస్టారెంట్ల సిబ్బందిని తప్పుదోవ పట్టిస్తూ బిల్లు ఎగ్గొడుతున్నాడు. నచ్చిన ఆహారాన్ని తిని… తీరా బిల్లు కట్టే సమయంలో గుండెపోటు వచ్చిందంటూ నాటకమాడి సిబ్బందిని ఏమారుస్తున్నాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20కి పైగా రెస్టారెంట్లను మోసం చేశాడు.

ఈ క్రమంలో ఇటీవల ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఆ వ్యక్తి.. ఆహారం తిని అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అంతలోనే సిబ్బంది వచ్చి అతడిని అడ్డుకున్నారు. హోటల్‌ రూంలో డబ్బులు ఉన్నాయని, తీసుకొచ్చేందుకు వెళుతున్నట్లు నమ్మించసాగాడు. కానీ అతడు వెళ్లేందుకు నిరాకరించిన సిబ్బంది వెంటనే డబ్బులు చెల్లించాలని పట్టుబట్టారు. ఇంతలో తనకు గుండెపోటు వచ్చిందంటూ నాటకమాడి నేలపై పడిపోయాడు. అంబులెన్స్‌కి ఫోన్‌ చేయాలని రెస్టారెంట్‌ సిబ్బందిని కోరాడు. అతడు నాటకమాడుతున్నట్లు గమనించిన సిబ్బంది… పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిందితుడిని అరెస్టు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *