Elon Musk – యూరప్‌లో.. సేవలకు మస్క్ ముగింపు పలకనున్నారా..?

సామాజిక మాధ్యమాలను (Social Media) నియంత్రించేందుకు ఐరోపా దేశాలు ప్రయత్నాలు చేస్తుండటంపై ఎలాన్ మస్క్ (Elon Musk) తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యూరప్‌లో మైక్రోబ్లాగింగ్ యాప్ ‘ఎక్స్ (Twitter)’.. సేవలకు ముగింపు పలికేందుకు ఎలాన్ మస్క్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఐరోపా సమాఖ్య ఇటీవల తీసుకువచ్చిన డిజిటల్ సర్వీసెస్ యాక్టు నిబంధనలపై ఎక్స్ (Twitter) అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ఎక్స్ యాప్‌ను అందుబాటులో లేకుండా చేయడం లేదా ఐరోపా దేశాల యూజర్లకు దీన్ని వినియోగించకుండా బ్లాక్ చేయడం వంటి అంశాలపై ఆయన చర్చించినట్లు సమాచారం.
సామాజిక మాధ్యమాలపై నియంత్రణ కోసం యూరోపియన్ యూనియన్ ఇటీవల డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (DSA) తీసుకువచ్చింది. హానికరమైన కంటెంటు వ్యాప్తి చెందకుండా నిరోధించడం, నిర్దిష్ట వినియోగదారుడిని లక్ష్యంగా చేసుకొనే కార్యకలాపాలను నిషేధించడం లేదా కట్టడి చేయడం, నియంత్రణ సంస్థలతో, పరిశోధకులతో అంతర్గత సమాచారాన్ని పంచుకోవడం వంటి నియమాలు ఆ చట్టంలో ఉన్నాయి. దీనిపై టెక్ సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మరోవైపు ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి ఘటనకు సంబంధించి అనేక వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఈయూ ఆన్‌లైన్ కంటెంటు నిబంధనలకు అనుగుణంగా ఎక్స్ వేదికపై తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయాలంటూ ఎలాన్ మస్క్‌కు ఈయూ ప్రతినిధి థియెర్రీ బ్రెటాన్ సూచించారు. దీనికి మస్క్ స్పందించినప్పటికీ.. ఈయూ మాత్రం డీఎస్‌ఏ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే యూరప్ నుంచి ఎక్స్ సేవలకు ముగింపు పలికేందుకు ఎలాన్ మస్క్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.