Drugs in America’s – విదేశాల్లో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరంలో డ్రగ్స్..

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు సమీపంలో ఉన్న అమెరికా సైనిక (US military)స్థావరం క్యాంప్ హంఫ్రీస్‌లో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారు. ఈ స్థావరంలో దక్షిణ కొరియా (South Korea)పోలీసులు, అమెరికా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. సైనిక మెయిల్, ఇతర సౌకర్యాలను వినియోగించుకుని సింథటిక్ గంజాయి (synthetic marijuana) వినియోగం, రవాణాకు పాల్పడుతున్నట్లు కొందరు సైనికులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాడి నిర్వహించినట్లు దక్షిణ కొరియాలోని సీనియర్ డిటెక్టివ్ చా మిన్ సియోక్ మీడియాకు తెలిపారు.
నాలుగు నెలల క్రితమే ఈ దాడులు జరిగినా.. ఈ విషయాన్ని దక్షిణ కొరియా బుధవారం వెల్లడించింది. ఇక్కడ సైనికులు మాదకద్రవ్యాలను వినియోగం, రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో దక్షిణ కొరియా పోలీసులు, అమెరికా ఆర్మీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగాలు కలిసి ఈ దాడులు జరిపాయి. సియోల్‌కు ఇరు వైపులా ఉన్న అమెరికా ఆర్మీ స్థావరాలు, ఔట్‌పోస్టులపై ఈ దాడులు జరిగాయి.
సింథటిక్ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై కనీసం 17 మంది అమెరికా సైనికులతో సహా మరో ఐదుగురిపై దర్యాప్తు జరిపారు. వీరిని విచారించిన అనంతరం దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మిగిలిన వారు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నిందితుల్లో సైనికుల భార్యలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఎవరూ తమ నిర్భంధంలో లేరని దక్షిణ కొరియా పేర్కొంది. ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియాలో గంజాయి వినియోగం, రవాణాకు కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి. నేరం రుజువైతే జీవిత ఖైదు లేదా 27 వేల డాలర్ల అపరాధ రుసుం విధిస్తారు.