Diplomatic tensions – ఖలిస్తాన్ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యతో భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు ఈ వివాదానికి తెరలేపాయి. దీనిపై తాజాగా అమెరికా (USA) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నిజ్జర్ హత్యపై కెనడా చేపట్టిన దర్యాప్తునకు భారత్ సహకరించాలని అమెరికా సూచించింది. (India Canada diplomatic row)
‘‘నిజ్జర్ హత్యతో భారత్ ఏజెంట్లకు సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టేందుకు ఒట్టావా చేస్తున్న ప్రయత్నాలకు మేం మద్దతిస్తున్నాం. పారదర్శకమైన, సమగ్ర దర్యాప్తుతోనే నిజానిజాలేంటో అందరికీ తెలుస్తాయని విశ్వసిస్తున్నాం. అందుకే, ఎలాంటి దర్యాప్తుకైనా భారత అధికారులు సహకరించాలని కోరుతున్నాం’’ అని శ్వేతసౌధం జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్ కెర్బీ విలేకరులతో అన్నారు. అటు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు.
‘‘ఇలాంటి ఆరోపణలు (భారత్‌పై ట్రూడో వ్యాఖ్యలనుద్దేశిస్తూ) ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తాయి. అయితే, క్రియాశీలకమైన నేర విచారణతోనే అసలు నేరస్థులకు శిక్ష పడుతుందని మేం భావిస్తున్నాం. ఇలాంటి ఘటనల్లో ఎవరూ ఓ నిర్ధారణకు రాకముందే ఈ దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నాం. అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమత్వ విధివిధానాలను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అందుకే పారదర్శక దర్యాప్తు జరగడమే సబబు’’ అని గార్సెట్టీ వ్యాఖ్యానించారు.
గత సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ పార్లమెంట్‌లో నిజ్జర్ హత్య గురించి మాట్లాడుతూ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన అతడిని తమ దేశ పౌరుడిగా ట్రూడో పేర్కొనడం కూడా తీవ్ర దుమారం రేపింది. అంతేగాక, కెనడాలో మన దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు భగ్గుమన్నాయి. ట్రూడో ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్.. మన దేశంలోని కెనడా రాయబారిని కూడా బహిష్కరించింది. అంతేగాక, కెనడాలో పెరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులు, ఇక్కడి నుంచి ఆ దేశానికి వెళ్లబోతున్నవారు అప్రమత్తంగా ఉండాలని భారత్ అడ్వైజరీ జారీ చేసింది.