Death of a Telugu student studying in America – అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థి మృతి

అమెరికా (USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి (Jaahnavi Kandula) మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. ఇదిలా ఉండగా.. పోలీసు అధికారి వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిన జాహ్నవికి మరణానంతరం డిగ్రీ (degree posthumously) ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది.
జాహ్నవి మృతిపై యూనివర్సిటీ (Northeastern University) ఛాన్సలర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఛాన్సలర్ మాట్లాడుతూ.. ‘‘ఈ విషాద ఘటన, దాని అనంతరం జరిగిన పరిణామాలతో మా క్యాంపస్‌లోని భారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితులయ్యారు. ఈ సమయంలో వారికి మేం అండగా ఉంటాం. అలాగే ఈ ఘటనలో బాధ్యులకు తప్పకుండా శిక్ష పడుతుందని మేం ఆశిస్తున్నాం. ఇక జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని మేం నిర్ణయించాం. ఆమె కుటుంబంసభ్యులకు దాన్ని అందజేస్తాం’’ అని వెల్లడించారు.