#International news

China : ప్రమాదానికి గురైన జలాంతర్గామి

ఎల్లో సముద్ర జలాల్లో చైనాకు చెందిన ఓ అణు జలాంతర్గామి ప్రమాదానికి గురై అందులోని 55 మంది నావికులు దుర్మరణం పాలయ్యారు. అమెరికా, దాని మిత్రపక్షాలకు చెందిన సబ్‌మెరైన్లు తమ క్వింగ్‌డావ్‌ నౌకాదళ స్థావరం ప్రాంతంలోకి ప్రవేశించకుండా సముద్రం అడుగున చైనా నిర్మించిన గొలుసుల ఉచ్చులోనే ఆ దేశ జలాంతర్గామి చిక్కుకుని ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదంపై బ్రిటన్‌కు చెందిన పలు వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ‘‘చైనాలోని షాండాంగ్‌ ప్రావిన్స్‌లోని ఎల్లో సముద్రంలో ఆగస్టు 21న  పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవీకి చెందిన 350 అడుగుల అణుశక్తి సబ్‌మెరైన్‌ ‘093-417’ సముద్రంలో ఉచ్చుకు చిక్కుకుపోయింది. దీంతో ఆ జలాంతర్గామిలో బ్యాటరీల శక్తి అయిపోయింది. ఫలితంగా అందులో ఉన్న వాయు శుద్ధీకరణ, వాయు నిర్వహణ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయి ఉండొచ్చని బ్రిటన్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చారు. కానీ, అది కూడా విఫలం కావడంతో గాలి కలుషితమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదంలో సబ్‌మెరైన్‌ కెప్టెన్‌ కర్నల్‌ షూ యాంగ్‌ పెంగ్‌ సహా 22 మంది అధికారులు, ఏడుగురు ఆఫీసర్‌ కేడెట్లు, 9 మంది పెట్టీ అధికారులు, 17 మంది నావికులు కలిసి మొత్తం 55 మంది సబ్‌మెరైనర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ జలాంతర్గామికి మరమ్మతులు చేసి సముద్రం అడుగు నుంచి పైకి తీసుకురావడానికి ఆరు గంటల సమయం పట్టింది. ఉచ్చులో చిక్కుకుపోయిన సబ్‌మెరైన్‌ విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని చైనా నిరాకరించింది. ఆగస్టులోనే ఈ ప్రమాదం జరిగినా.. ఆ దేశం ఇప్పటి వరకు నోరు మెదపలేదు’’ అంటూ బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాల రిపోర్టుల ఆధారంగా మీడియా పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *