‘Canada – కెనడియన్ హిందువులు భయపడుతున్నారు.

కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోవడానికి తమ పార్టీదే బాధ్యత అని కెనడా అధికార పార్టీ ఎంపీ చంద్ర ఆర్య పేర్కొన్నారు. ఉగ్రవాదులు చేసిన బెదిరింపులతో కెనడా హిందువుల్లో భయం నెలకొందని భారత సంతతి వ్యక్తి, అధికార లిబరల్ పార్టీ సభ్యుడు చంద్ర ఆర్య స్పష్టం చేశారు. ప్రధాని జస్టిన్ ట్రూడో పార్టీకి చెందిన ఆయన.. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో హిందూ కెనడియన్లు సంయమనంతో ఉండాలని మరోసారి సూచించారు.
‘ప్రధానమంత్రి ట్రూడో ప్రకటన తర్వాత ఏం జరుగుతుందో..? తదుపరి పర్యవసానాలపై నేనెంతో ఆందోళన చెందుతున్నా. ఇక్కడి హిందూ కెనడియన్ల భద్రతపై ఆందోళన నెలకొంది. హిందూ కెనడియన్లు ఎంతో భయంతో ఉన్నారు’ అని అధికార లిబరల్ పార్టీ ఎంపీ చంద్ర ఆర్య పేర్కొన్నారు. సీబీసీ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. జాతి, మతపరమైన రక్తపాతం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా హిందూ కెనడియన్లలో భయానికి మూడు కారణాలను విశ్లేషించారు.
‘ఖలిస్థాన్ ఉద్యమం అనేది హింస, హత్యలతో కూడుకున్నది. 38ఏళ్ల క్రితం జరిగిన ఎయిరిండియా బాంబు దాడి ఘటన చరిత్రలోనే అతిపెద్ద సామూహిక హత్యను కెనడియన్లు మరచిపోయారు. ఇక రెండో అంశం.. ఇందిరా గాంధీ కట్‌ఔట్‌ను ఊరేగించిన విషయం. ఇటువంటి భావప్రకటనా స్వేచ్ఛను ఏదేశం అంగీకరిస్తుంది? మూడోది.. హిందూ కెనడియన్లు కెనడా వీడి పోవాలంటూ గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం శోచనీయం’ అని ఎంపీ చంద్ర ఆర్య పేర్కొన్నారు. అయితే, కొందరు తీవ్రవాద భావజాలం ఉన్నవారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నప్పటికీ.. ఎంతోమంది సిఖ్-కెనడియన్లు మాత్రం ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదన్నారు. వారంత హిందూ కెనడియన్లతోనే మమేకమయ్యారని అధికార పార్టీ ఎంపీ చంద్ర ఆర్య స్పష్టం చేశారు.