Canada : వీసా సేవల్ని పునరుద్ధరించనున్న భారత్..

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య తలెత్తిన దౌత్యపరమైన ఉద్రిక్తతలతో కెనడా పౌరులకు ఇటీవల భారత్ వీసా సేవల్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో వీసా సేవల్ని పునరుద్ధరిస్తూ ఒట్టావాలోని భారత హైకమిషన్ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీల్లో మాత్రమే ఈ సేవల్ని పునరుద్ధరిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాలను మాత్రమే జారీ చేయనున్నట్లు స్పష్టంచేసింది. భద్రతా పరిస్థితులపై సమీక్ష అనంతరం అక్టోబర్ 26 నుంచి ఆయా కేటగిరీల్లో వీసా సర్వీసుల్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసుకుంటూ తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపింది.
నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని.. అక్కడి మన దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రూడో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్.. మన దేశంలో కెనడా రాయబారిని కూడా బహిష్కరించింది. అంతేగాక, కెనడాలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రవాస భారతీయులు, కెనడా వెళ్లాలనుకునేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ ఓ అడ్వైజరీ కూడా జారీ చేసింది. అదే సమయంలో భారత్‌లోని రాయబార కార్యాలయంలో సిబ్బందిని సైతం కెనడా వెనక్కి పిలిపించుకున్న పరిణామాలు చోటుచేసుకున్నాయి.