Blitz attack in America- ఫ్లాష్‌మాబ్ తరహాలో దుకాణాలు దోచిన యువత.

ఫ్లాష్‌మాబ్ తరహాలో వచ్చిన కొందరు యువకులు పలు దుకాణాలు లూటీ చేసిన ఘటన అమెరికాలో సంచలనం రేపింది. ఫిలడెల్ఫియాలోని అనేక స్టోర్లపై దాదాపు వందమంది యువకులు ఒకేసారి దాడులు చేసి ఇష్టానుసారం దోచుకున్నారు. మంగళవారం రాత్రి 8.00 గంటల సమయంలో మాస్కులు, హుడీలు ధరించి సిటీ సెంటర్లోని స్టోర్లపై యువతీ యువకులు దోపిడీకి తెగబడ్డారు. చేతికి అందినది దోచుకొని అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై దాడి చేసి పారిపోయారు. ఓ యాపిల్ స్టోర్‌లోకి ప్రవేశించి.. ఐఫోన్లు, ఐపాడ్‌లతోపాటు ఇతర వస్తువులన్నింటినీ వారు దోచుకొంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు 52 మందిని అరెస్టు చేశారు. వీరిలో కొందరి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరంతా సోషల్ మీడియాలో సమన్వయంతోనే ఈ దోపిడీకి పన్నాగం పన్నినట్లు కనిపిస్తోందని నగర ఇన్ఛార్జ్ కమిషనర్ జాన్ స్టాన్‌ఫర్డ్ చెప్పారు. నగరం మొత్తం కార్లలో తిరుగుతూ దుకాణాల్లోకి చొరబడ్డారని తెలిపారు.