Bhutan – పురోగతికి తోడ్పాటు

భూటాన్ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి భారత్ పూర్తిస్థాయి తోడ్పాటు అందిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మన దేశంలో పర్యటిస్తున్న భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యెల్ వాంగ్చుక్ సోమవారం మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దుల గుండా సంధానతను పెంచుకోవాలని, వాణిజ్యం, మౌలిక వసతులు, ఇంధన రంగాల్లో సంబంధాలను వృద్ధి చేసుకోవాలని ఇద్దరు నేతలు ఒక అంగీకారానికి వచ్చారు. ఈ సమావేశం అనంతరం ఒక సంయుక్త ప్రకటన వెలువడింది. అస్సాంలోని కోక్రాఝార్ నుంచి భూటాన్లోని గెలెఫు మధ్య ప్రతిపాదిత రైల్వే మార్గం కోసం తుది సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్లోని బనర్హాత్ నుంచి భూటాన్లోని సమత్సే మధ్య మరో రైలు మార్గం ఏర్పాటు చేసే అంశంపై పరిశీలన జరపనున్నారు. సరిహద్దు వాణిజ్యానికి అవసరమైన మౌలిక వసతులు, పెట్టుబడులు, ఇంధనం, ఆరోగ్యం, విద్య అంతరిక్ష పరిజ్ఞానం, ప్రజల మధ్య సంబంధాల విషయంలో సహకరించుకోవాలని నిర్ణయించారు.. అస్సాంలోని వైద్య కళాశాలల్లో భూటాన్ విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లను కేటాయించేందుకు భారత్ అంగీకరించింది.